Blog

గజేంద్ర మోక్షం

thought-of-the-day

గజేంద్ర మోక్షం

నీరాట వనాటములకుఁ
బోరాటం బెట్లు కలిగెఁ? బురుషోత్తముచే
నారాట మెట్లు మానెను?
ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్.

భావము:- ”నీటిలో బతుకుతుంది మొసలి. అడవిలో తిరుగుతుంది ఏనుగు. వాటిలో అది భద్రగజం. అయితే ఆ రెంటికి అసలు పోరాటం ఎందుకు జరిగింది ఎలా జరిగింది. అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు.
భాగవతం బహుళార్థ సాధక గ్రంధం. అందులో పంచరత్న ఘట్టాలలో ఒకటైన గజేంద్రమోక్షంలోని ఎత్తుగడ పద్యం ఇది. చక్కటి “ఏకేశ్వరోపాసన” తో కూడుకున్న ఘట్టమిది.

మంచి ప్రశ్న వేస్తే మంచి సమాధానం వస్తుంది. ఇంత మంచి ప్రశ్న పరీక్షిత్తు అడగటం జరిగింది కనుకనే శుకుని నుండి గజేంద్రమోక్షణం అనే “సుధ” జాలువారింది. ఏనుగులు భద్రం, మందం, మృగం అని మూడు రకాలు. వాటిలో భద్రగజం దైవకార్యాదులలో వాడతారు. అట్టి భద్రగజాల కోటికి రాజుట మన కథానాయకుడు గజేంద్రుడు. అఖిలలోకేశ్వరుడు, దయాసాగరుడు ఐన శ్రీహరి మొసలి నోటికి చిక్కిన ఒక గజరాజుని ప్రాణభయంనుండి కాపాడి రక్షించాడు. ఈ అధ్భుత ఘట్టంలోని “ఎవ్వనిచే జనించు. . .” మున్నగు పద్యాలన్నీ అమృతగుళికలే కదా.

రహస్యార్థం: నీరు అనగా చిత్స్వరూపి, బుద్ధి. (ప్రమాణం చిత్స్వరూపం, సర్వ వ్యాపకుడు అయిన విష్ణువే ద్రవ (జల) రూపం అయి నిస్సంశయంగా గంగారూపం పొందుతున్నాడు. అట్టి బుద్ధి రూపమే సంకల్ప రూపం పొందుతుంది. సంకల్పం మనస్సు ఒకటే. అది నీరాటము. సంకల్పం నుండి పుట్టేది కామము. వనమునకు వ్యుత్పత్తి “వన్యతే సేవ్యతే ఇతి వనం” అనగా జీవులచే సేవింపబడునది వనం. అలా కామం వనాటం. అంటే ఆత్మ యొక్క కళ అనే ప్రతిబింబం జీవుడు కదా. ఆ నీరాటమునకు మరియు వనాటం అయిన కామమునకు సంసారం అనే ఘోర అడవిలో కలహం ఎలా కలిగింది? అని ప్రశ్న. పురుషోత్తముడు అయిన విష్ణువు ఆ పోరు అనే భవదుఃఖాన్ని ఎలా తొలగించాడు? అని ప్రశ్న.
శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *