Blog

నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి

thought-of-the-day

నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి

నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?, ఈ మాట ఎంతవరకు సత్యం లేదా ఎంత సత్యదూరం…

ఈ మధ్యకాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి.
నవగ్రహాలను దర్శించిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మములోనూ చెప్పబడలేదు.

ఈమధ్యకాలంలో క్రొత్తగా నవగ్రహాలు అంటే దోషాలు తొలగించేవి అని, దోషాలన్నీ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే పోతాయని ప్రదక్షిణలు చేసి ఆ దోషాలు నవగ్రహాల వద్దనే వదిలేసి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తున్నాం అయిపోయింది అని ఇటువంటి భావజాలం క్రొత్తక్రొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ సత్యదూరాలు. ఆలయంలోనికి వెళ్ళే పూర్వమే కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే ఇంటిలోనుంచి బయలుదేరే సమయంలోనే ఆలయానికి వెళ్తున్నాం అనే భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి, పూలు, పూజాసామగ్రి తీసుకొని మౌనంగా దేవాలయానికి వెళ్ళాలి. నవగ్రహాల గుడికే వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని, తరువాత ప్రధాన దేవాలయానికి, అలా లేనప్పుడు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఉప ఆలయాలలో ఇతర దేవీదేవతల దర్శనం చేసుకొని ఆ పిమ్మట నవగ్రహాలను కూడా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి. మధ్యలో ఈ కాళ్ళు కడుక్కోవడం అన్న వ్యవహారం ఎక్కడా లేదు. ఇంటిలోనుంచి ఆలయం కాస్త దూరం అయితే ఆలయంలోకి ఈ దుమ్ము కాళ్ళతో వెళ్ళడం ఇబ్బందికరం కనుక ఆలయ పరిశుభ్రతకు ఆటంకం అన్న ఉద్దేశంతో అలాగే స్నానం చేసిన శుభ స్వరూపం మారిపోతుంది కనుక ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కాళ్ళు కడుక్కొని నవగ్రహాల గుడికి అనుకుంటే నవగ్రహ ప్రదక్షిణం చేసి ప్రధాన దైవదర్శనం చేసి ఇంటికి రావాలి. అంతేకానీ దేవతారాధన చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోకూడదు. లఘుశంక వంటి వాటికి వెళ్ళినప్పుడు, ఏదైనా అపశబ్దం విన్నప్పుడు కాళ్ళు కడుక్కుంటాం. కాళ్ళు కడుక్కోవడం అంటే స్నానం చేయడంతో సమానం. నవగ్రహారాధన కూడా దేవతారాధనలో అంతర్భాగమే కనుక నవగ్రహ దర్శనం చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలి అనడం సత్యదూరము. అది మంచి పద్ధతి కాదు. నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఆ దైవ వీక్షణం మనమీద ఉంటుంది. అలాంటప్పుడు మనం కాళ్ళు కడుక్కుంటే దేవతాభావం దూరమైనట్లే కదా! ప్రయోజనమేమున్నది? కాబట్టి అలా కాళ్ళు కడుక్కోకూడదు. ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కడుక్కోవాలి. అంతే. ఈ కార్యక్రమం మళ్ళీమళ్ళీ లేదు. ఆలయంనుంచి నేరుగా ఇంటికే రావాలి. ఎవరింటికీ వెళ్ళకూడదు, ఇంక యేపనీ చేయకూడదు.

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *