రామదాసు కీర్తనలు
రామదాసు కీర్తనలు
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి న..
కల్యాణి – ఆది ( – త్రిపుట)
పల్లవి:
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి న..
చరణము(లు):
ననుబ్రోవమని చెప్పవే నారీశిరోమణి
జనకుని కూతుర జనని జానకమ్మ న..
ప్రక్కను చేరుక చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి సొక్కుచుండెడి వేళ న..
ఏకాంతరంగుడు శ్రీకాంత నినుగూడి
ఏకాంతమున నేకశయ్యనున్న వేళ న..
అద్రిజవినుతుడు భద్రగిరీశుడు
నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి న
పలుకే బంగారమాయెనా
ఆనందభైరవి – రూపక
పల్లవి:
పలుకే బంగారమాయెనా కోదండపాణి ప..
చరణము(లు):
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీనామ స్మరణ మరువ చక్కని తండ్రి ప..
ఇరువుగ నిసుకలోన బొరలిన యుడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి ప..
రాతి నాతిగజేసి భూతలమందున ప్ర
ఖ్యాతిజెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి ప..
ఎంతవేడినను నీకు సుంతైన దయరాదు
పంతముచేయ నేనెంతటివాడను తండ్రి ప..
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
కరుణించు భద్రాచల వరరామ దాసపోష ప..
ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను
కాంభోజి – ఆది (- త్రిపుట)
పల్లవి:
ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను
రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ..
చరణము(లు):
చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ..
గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా నను
క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా ఇ..
భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా
ఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ..
శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్రా
ఆ మొలత్రాడునకు బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా ఇ..
లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ..
సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ..
వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్రా జగ
న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా ఇ..
కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా ఇ..
మీ తండ్రి దశరథమహారాజు పెట్టెనా రామచంద్రా
లేక మీమామ జనకమహారాజు పంపెనా రామచంద్రా ఇ..
అబ్బా తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్రా
ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా ఇ..
సర్కారు పైకము తృణముగనెంచకు రామచంద్రా
దెబ్బలకోర్వను యప్పుదీర్చుమయ్య రామచంద్రా ఇ..
ఏటికి జల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా
నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా ఇ..
కౌసల్యపుత్రుడ దశరథతనయుడ రామచంద్రా
కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్రా ఇ..
భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా
నీవు క్షేమముగ రామదాసుని నేలుము రామచంద్రా ఇ..
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
వరాళి – ఆది (మోహన – ఆది)
పల్లవి:
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
ముదముతో సీత ముదిత లక్ష్మణులు
కలసి కొలువగా రఘుపతియుండెడి ఇది..
చరణము(లు):
చారుస్వర్ణప్రాకార గోపుర
ద్వారములతో సుందరమైయుండెడి ఇది..
అనుపమానమై యతిసుందరమై
దనరుచక్రమది ధగధగ మెరిసెడి ఇది..
కలియుగమందున నిలవైకుంఠము
నలరుచునున్నది నయముగ మ్రొక్కుడి ఇది..
పొన్నల పొగడల పూపొదరిండ్లతొ
చెన్నుమీరగను చెలగుచునున్నది ఇది..
శ్రీకరముగ శ్రీరామదాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము ఇది..