Blog

అమలక ఏకాదశి

thought-of-the-day

అమలక ఏకాదశి

ప్రళయ కాలంలో సృష్టి అంతా జలయమయం అయినటువంటి తరుణంలో బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును గురించి కఠోరమైన తపస్సును ఆచరిస్తున్నాడు. ఆ తరుణంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి కనిపించగానే బ్రహ్మదేవుడి యొక్క కన్నుల నుండి ఆనంద భాష్పాలు జారి భూమి మీద పడ్డాయి. ఆ ఆనంద భాష్పాల నుంచే ఉసిరిక చెట్టు ఆవిర్భవించిందని పురాణాలలో వర్ణించడం జరిగింది. ఉసిరిక చెట్టు మొత్తం శ్రీ మహావిష్ణువు వ్యాపించి ఉంటాడని స్కాంద పురాణంలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు (అమలక ఏకాదశి) ఎవరైతే ఉసిరి చెట్టు ఆరాధన చేస్తారో, ఎవరైతే ఉసిరిక చెట్టు క్రింద శ్రీమహా విష్ణువు యొక్క చిత్రపటం కానీ, కృష్ణ పరమాత్మ పటం కానీ ఉంచి అర్చన చేస్తారో వారికి శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క/శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని పురాణాలలో, శాస్త్రాలలో వర్ణించడం జరిగింది.

అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి, చెట్టు మొదట్లో నీళ్ళు పోసి, ఉసిరిక చెట్టుకు పసుపు, కుంకుమ, గంధము అలంకరించి పసుపు రంగు దారాన్ని తీసుకొని ఉసిరిక చెట్టుకు 13సార్లు చుడుతూ ముళ్ళు వేయాలి. ఆ తర్వాత ఉసిరిక చెట్టు చుట్టూ పదమూడు ప్రదక్షిణలు చేయాలి. ఆ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మంత్ర శాస్త్ర పరంగా ఒక శ్లోకాన్ని చదువుకోవాలి.

“ధాత్రీ దేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి!
వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తథాకురు!!

ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఉసిరిక చెట్టును సాక్షాతూ తల్లి రూపంగా ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. తల్లిలాంటి ఉసిరిక చెట్టుకు ఈ శ్లోకాన్ని చదువుతూ పూజ చేస్తే ఉసిరిక చెట్టు యొక్క అనుగ్రహం ద్వారా అద్భుతమైన తేజస్సును, యశస్సును పెంపొందింప జేసుకోవటంతో పాటుగా ధనప్రాప్తిని పొందవచ్చు. ఈ శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణ చేస్తూ చివరిగా “ఓం విష్ణు రూపిణ్యై దాత్ర్యై నమః” అని ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. ఆవిధంగా ఉసిరిక చెట్టును పూజించిన తరువాత ఏకాదశీ వ్రతాన్ని ఆచరిస్తే జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలౌతాయి. పసుపు రంగు పుష్పాలతో ఉసిరిక చెట్టుకు పూజ చేయాలి.

శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *