అమ్మ వారిని “పంచసంక్యోపచారిని”అనే పద ప్రయోగం చేయడం జరిగింది
అమ్మ వారిని “పంచసంక్యోపచారిని”అనే పద ప్రయోగం చేయడం జరిగింది
జై శ్రీరామ్ జై హనుమాన్
శ్రీలలితాసహస్ర నామాలలో, అమ్మ వారిని “పంచసంక్యోపచారిని”అనే పద ప్రయోగం చేయడం జరిగింది, ఆ మహర్షులైన అగస్త్య మరియు హయగ్రీవులచే … దీని అర్ధం ఏమిటి అంటే, హైన్దవులాగా ఉన్న మనం ప్రతిరోజూ, మనం పూజించే ఆ భగవత్స్వరూపానికి, కనీసం లో కనీసం, ఐదు ఉపచారాలు చేయాలనీ మనకి తెలియచేస్తున్నారు, అమ్మవారిని కీర్తిస్తూ..
ఆ ఐదు ఉపచారాలు వరుసగా. శ్రీగంధం, పుష్పం, ధూపం, దీపం, మరియు నైవేద్యంగా చెప్పబడతాయి…ఇప్పుడు వీటినే పంచసంక్యోపచారాలుగా ఎందుకు చెప్పడం జరిగింది అంటే…
మీరు ఏ భగవత్ స్వరూపాన్ని పూజిస్తారో.. ఆ భగవత్ నామాన్ని ఇలా అనుసంధానం చేస్తే, అప్పుడు ఆమాటే మంత్రంగా చూడబడుతుంది…
“ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీగంధం సమర్పయామి” అని ఆ భగవత్ నామంతో, ఈ ఉపచారాన్ని అందచేయాలి.. (అయితే, ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తువుంచుకోవాలి, అది ఏమిటి అంటే, బజారులో కొన్న శ్రీగంధం (చందనం) కాకుండా, లేపాక్షి దూకాణాలలో గంధపు చెక్కలు అమ్మకానికి ఉంచబడతాయి, వాటిని, కొని, ఆ చెక్కాన్ని అరగదీసి,(ఈ ప్రక్రియను కూడా, భగవత్ “సేవ” గానే చూడబడుతుంది) ఆ వచ్చిన గంధాన్ని లేదా చందనాన్ని ఆ భగవత్ స్వరూపానికి సమర్పించండి… ఇది ఎందుకు అంటే, ఆ పరంధాముడు, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఉన్న చర్మం, ఆ బిడ్డతో పాటుగా, ఎటువంటి ఒడిదుడుకులు లోనుకాకుండా.. అంత చక్కగ్గా సాగుతూ, శరీరానికి తగినంతగా ఉన్నందుకు కృతజ్ఞతగా ఆ భగవత్ స్వరూపానికి శ్రీగంధం లేదా శ్రీచందనం సమర్పిస్తున్నాము…
“ఓం శ్రీకృష్ణాయ నమః, నైవేద్యం సమర్పయామి” అని ఆ భగవత్ నామంతో, ఈ ఉపచారాన్ని అందచేయాలి.. (అయితే, ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తువుంచుకోవాలి, అది ఏమిటి అంటే, శరీరాన్ని కష్టపెట్టి, పంచభక్ష్య పరమాన్నాలు ఉంచనవసరం లేదు, చిన్న బెల్లం ముక్కను ఆ భగవత్ స్వరూపానికి సమర్పించండి… ఇది ఎందుకు అంటే, ఆ పరంధాముడు, ప్రతి మనిషికి, అద్భుతమైన నాలుకను (దీని ద్వారా ప్రతిరోజూ అనేకానేక రుచులు ఆస్వాదిస్తునందుకు కృతజ్ఞతగా, ఆ భగవత్ స్వరూపానికి చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తున్నాము…
మూడవ ఉపచారము, “ధూపం”, ఈ ఉపచారాన్ని.. “ఓం శ్రీకృష్ణాయ నమః, ధూపం ఆఘ్రాపయామి ” అని ఆ భగవత్ నామంతో, ఈ ఉపచారాన్ని అందచేయాలి.. ఎందుకు ఈ ఉపచారము చేయాలి అంటే, ఆ పరంధాముడు మనకి, ఒక చక్కని లేదా అద్భుతమైన నాసికాన్ని (ముక్కు) ఏర్పాటుచేసినందుకు, దాని ద్వారా మనం సృష్టిలో ఉన్న, అన్ని సువాసనలు మనం ఈ నాసికం ద్వారా అనుభవంలోకి తెచ్చుకున్నందుకు .. కృతజ్ఞతగా ఈ “ధూపం ఆఘ్రాపయామి” అనే ఉపచారాన్ని అందచేస్తున్నాము
ఇప్పుడు, వరుసలో ఉన్న, నాలుగవ ఉపచారము, “దీపం”, ఈ “దీపం” ఉపచారాన్ని.. “ఓం శ్రీకృష్ణాయ నమః, దీపం దర్శయామి ” అని ఆ భగవత్ నామంతో, ఈ ఉపచారాన్ని అందచేయాలి.. ఎందుకు ఈ ఉపచారము చేయాలి అంటే, ఆ పరంధాముడు మనకి, అద్భుతమైన రెండు కన్నులు (చక్షువులు) ఇచ్చినందుకు, ఈ చక్షువులు ద్వారా ఈ విశ్వం లో ఉన్న, ఆ పరంధాముని స్వరూపమైన , ప్రతి విభూదిని చూసి ఆనందిస్తున్నాం అందుకు కృతజ్ఞతగా ఈ “దీపం” ఉపచారాన్ని అందచేస్తున్నాం……
మిగిలిన ఒక ఉపచారము “పుష్పం”, ఈ ఉపచారాన్ని.. “ఓం శ్రీకృష్ణాయ నమః, పుష్పం సమర్పయామి ” అని ఆ భగవత్ నామంతో, ఈ ఉపచారాన్ని అందచేయాలి.. ఎందుకు ఈ ఉపచారము చేయాలి అంటే, ఆ పరంధాముడు మనకి రెండు అద్భుతమైన శ్రవణాలు (చెవులు) ఇచ్చినందుకు, దాని ద్వారా మనం సృష్టిలో ఉన్న ధర్మాలు, ఈ శ్రవణాలు ద్వారా అనుభవంలోకి తెచ్చుకుని, ఆ విధముగా మన జీవన ప్రయాణాన్ని సాగిస్తునందుకు .. కృతజ్ఞతగా ఈ “పుష్పం సమర్పయామి” అనే ఉపచారాన్ని అందచేస్తున్నాము.
పైన చెప్పుకున్న ఈ ఐదు ఉపచారాలు, మనకు, ఆ పరంధాముడు, ఎంతో ప్రేమతో, కరుణతో ఇచ్చిన ఈ ఐదు జ్ఞానేంద్రియాలు (కన్ను, ముక్కు, చెవి, నాలుక, మరియు చర్మం) కృతజ్ఞతగా ఆ పరంధామునికి, మనం ఎంతో శ్రద్దా భక్తులతో, ఆ “లలితమ్మణ్ణి” ఆ మహర్షులు స్తుతించిన విధముగానే, మీ మనసుకు దగ్గరైన, ఆ (ఏ) భగవత్ స్వరూపాన్ని , ప్రతి రోజు, పురుష సూక్తములో అందచేసిన పదహారు ఉపచారాలలో, కనీసంలో కనీసం ఈ ఐదు ఉపచారాలు కనీసంలో కనీసం ప్రతి రోజు ఆచరించి , మనకు దక్కిన ఈ అద్భుతమైన మానవజన్మకు అర్ధం, పరమార్థం ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”
జై శ్రీమన్నారాయణ