Blog

మ్రింగెడి వాఁడు విభుం డని…

thought-of-the-day

మ్రింగెడి వాఁడు విభుం డని…

జై శ్రీరామ్ జై హనుమాన్

మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!

భావము:

ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.

(ఇది అసామాన్య శబ్దార్థసౌందర్యభరితమైన పద్యం. శివుడు లోకాలన్ని దహించేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే. కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది. భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా. అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకొన్నావిడ. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాదానం ఈ పద్యం. మ్రింగ్ మ్రింగ్ అంటూ ఎలా ధ్వనిస్తోందో. (పూర్ణానుస్వరపూర్వక గకార ప్రాస) అటుపక్క ఆ గరళానికి, మంగళ మంగళ అంటూ సమాధానాలను వేసిన తీరు పద్యానికి ఎంత అందాన్నిచ్చిందో. మరల మరల ప్రయోగించిన గ’, ళ’ లు, మింగటంలో గళం లోనే ఆపేసాడు అని, శక్తి స్వరూపిణి స్త్రీతో పాలుపంచుకంటుంటే ఎంతటి కాలకూటవిషం ఎదురొచ్చినా మంగళానికి లోటు ఉండదు అని స్పురిస్తోంది.)

శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *