Blog

వారాణసిలో శంకరులు:

thought-of-the-day

వారాణసిలో శంకరులు:

శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.

వారాణసిలో శంకరులు:

గుర్వాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు.

మనీషా పంచకం:

ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.

“అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి”

సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు

ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశారు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: “వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి.” ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.

ప్రస్థానత్రయం:

అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరికి బయలు దేరారు. బదరిలో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము మరియు “లలితా త్రిశతి”లకు కూడా భాష్యాలు వ్రాశారు.

వ్యాసమహర్షి:

ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశంసించాడు.

వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరులు ‘నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ’మని వ్యాసుని కోరగా, వ్యాసుడు “లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్ధాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక” అని దీవించాడు.

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *